
కొత్తపల్లి, వెలుగు: తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఒకరిని కొత్తపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్ గ్రామానికి చెందిన ప్రదీప్ (30) మరో 8 మంది ముఠాగా ఏర్పడి ఏడాదికాలంగా కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి వేళల్లో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
అక్కడి నుంచి ట్రావెల్స్ బస్సుల ద్వారా నిజామాబాద్, అక్కడి నుంచి కరీంనగర్‌కు చేరుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కీ నిర్వహిస్తారు. తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి అర్ధరాత్రి దాటాక తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడతారు. వరుస చోరీలతో కరీంనగర్ రూరల్ ఏసీపీ సీసీఎస్, కొత్తపల్లి పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం మధ్యప్రదేశ్ వెళ్లి దొంగలను గుర్తించారు.
ఈ ముఠాలోని ప్రధాన నిందితుడైన ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ ముఠా గుంటూరుపల్లి, మల్కాపూర్, చింతకుంట ప్రాంతాల్లో నాలుగు దొంగతనాలకు పాల్పడ్డారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన ఎస్సై సాంబమూర్తి, కానిస్టేబుళ్లు షరీఫ్, శ్రీనాథ్, ఖదీర్‌ను రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, ట్రైనీ ఐపీఎస్ అభినందించారు.
అమ్మవారి ఆలయంలో చోరీ
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్‌లో గల శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి హుండీని, ఆలయంలోని రూ.70వేల విలువైన విద్యుత్ సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు టౌన్ ఎస్ఐ కిరణ్ తెలిపారు.